అరకులోయ, ఏప్రిల్ 9: కడప, పులివెందులలో జరిగే ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి ‘గుడ్‌బై’ చెప్పనున్నట్టు అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సబ్బం హరి వెల్లడించారు. అరకులోయ నియోజకవర్గ కేంద్రంలో దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆయన శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యునిగా కొనసాగుతున్న తాను ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆ పార్టీకి రాజీనామా చేస్తానన్నారు. కడప, పులివెందుల స్థానాల్లో నుంచి ఎన్నికల బరిలో ఉన్న విజయమ్మ, వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి అఖండ మెజార్టీతో గెలుపొందినట్టు ప్రకటన వెలువడిన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకుంటానని ఆయన తెలిపారు. తాను తీసుకున్న ఈ నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండబోదని, అంతవరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తన చేరికపై వేచి ఉండకతప్పదని ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాలను దాదాపు 40 వరకు ఆవిష్కరించానని ఆయన చెప్పారు. నర్సీపట్నం, చోడవరం, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో తన చేతుల మీదుగా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్. తనయుడు, కడప మాజీ పార్లమెంట్ సభ్యుడు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు అటువంటి ప్రయత్నాలను విరమించుకోవాలని కొంతమంది నాయకులను అప్పట్లో తాను హెచ్చరించినట్టు ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. జగన్మోహన్‌రెడ్డి పార్టీని వీడితే కాంగ్రెస్ పార్టీకి కష్టకాలం మొదలవుతుందని అప్పట్లో తాను చెప్పిన మాటలు నేడు సత్యరూపం దాల్చాయన్నారు. తానెప్పుడూ స్థానిక నాయకులను గౌరవిస్తానని, అదేవిధంగా కార్యక్రమాల్లో వారికి ప్రాధాన్యత కల్పిస్తానని, అయితే ఇందుకు భిన్నంగా మన్యం వాసులు వ్యవహరిస్తుండడం తనకు ఆశ్చర్యం కలిగిస్తుందని ఆయన చెప్పారు. స్థానిక నాయకులను వీడి ఇతరత్రా ప్రాంతాల నుంచి వచ్చే నేతలను ఈ ప్రాంతం వారు గౌరవించడం ఆశ్చర్యకరంగా ఉందని సబ్బం హరి పేర్కొన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన మాజీ శాసనసభ్యుడు కుంభా రవిబాబు మాట్లాడుతూ గిరిజనుల అండదండలతో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆశయాల పరిరక్షణ కోసం పోరాడుతానన్నారు. రాజకీయంగా వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డిని అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా కడప, పులివెందుల నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో విజయమ్మ, జగన్మోహన్‌రెడ్డిల గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ఆయన చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ గెలుపుకు ప్రతీఒక్క గిరిజనుడూ తమవంతు కృషిచేయాలని ఆయన కోరారు. రానున్న కాలంలో జగన్మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని నియోజకవర్గ ప్రజలు బలపర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంతో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవ్వడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను సైతం మార్చేస్తుందని కుంభా రవిబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు పూడి మంగపతిరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమారాణి, కొయ్య ప్రసాద్‌రెడ్డి, రఘురాజు, పోతురాజు, పాంగి చిన్నారావు, విజయ్‌కుమార్, బూర్జబారికి జగ్గన్న, పి.కొండలరావు, శెట్టి ఆనందరావు, శోభా వీరభద్రరాజు, గుడివాడ ప్రకాశ్‌రావు, వెచ్చంగి పద్మ, వెచ్చంగి గంతన్న, కాసులమ్మ, కొండబాబు, పద్మలతో పాటు వివిధ మండలాలకు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు, గిరిజనులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment