Saturday 14 May 2011

కాంగ్రెస్‌లో కలవరం


న్యూఢిల్లీ, మే 13: కడప లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి భారీ మెజారిటీ కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కలవరపెడుతోంది. జగన్ దాదాపు ఐదు లక్షల యాభై వేల మెజారిటీతో అద్భుత విజయం సాధించటం, ఆయన తల్లి విజయలక్ష్మి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 86 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. జగన్, విజయలక్ష్మిలకు మెజారిటీ వస్తుందని హైకమాండ్ అంచనా వేసింది. కానీ ఇంత భారీ మెజారిటీ వస్తుందని ఊహించలేకపోయారు. ముఖ్యంగా జగన్‌మోహన్‌రెడ్డి ఐదున్నర లక్షల మెజారిటీతో లోక్‌సభకు మళ్లీ ఎన్నికల కావడం ఎటు దారితీస్తుందనేది అధినాయకత్వానికి అర్థం కావటం లేదు. ఒక వైపు జగన్ రాజకీయం మరోవైపు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కాంగ్రెస్ అధినాయకత్వానికి పెద్ద సమస్యగా మారింది. తెలంగాణ సమస్యను పరిష్కరించలేకున్నా జగన్ సమస్యను తమకు అనుకూలంగా మార్చుకోవచ్చునని అధినాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. జగన్‌ని కాంగ్రెస్‌లోకి తెప్పించుకునేందుకు ప్రమత్నించటం ద్వారా ఈసమస్యను పరిష్కరించుకోవచ్చునని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ ఆలోచిస్తున్నారని తెలిసింది. ఆజాద్ శుక్రవారం మధ్యాహ్నం కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల ఫలితాలను విశే్లషించిన అనంతరం కొందరు విలేఖరులతో అనధికారికంగా మాట్లాడుతూ జగన్‌ని కాంగ్రెస్‌లోకి రప్పించేందుకు ప్రయత్నిస్తామని చెప్పినట్లు తెలిసింది. జగన్‌ని వదులుకోవటమే మొదటి తప్పు అని ఆయన అభిప్రాయపడ్డారని అంటున్నారు. జగన్‌ను కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళకుండా చూడవలసిందని కూడా ఆయన అన్నట్లు తెలిసింది. జగన్‌ను తిరిగి కాంగ్రెస్‌లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామంటూ 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగేలోగా ఈ లక్ష్యాన్ని సాధించవలసి ఉంటుందని ఆజాద్ అన్నట్లు తెలిసింది.

బుద్ధి తెచ్చుకుని మసలుకోండి


న్యూఢిల్లీ, మే 13: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసిన తరువాతనైనా బిజెపి, వామపక్షాలు బుద్ధి తెచ్చుకోవాలని ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సలహా ఇచ్చారు. కేంద్రంలోని యుపిఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని అన్నారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, మీడియా విభాగం అధిపతి జనార్దన్ ద్వివేదీతో కలిసి ప్రణబ్ విలేఖర్లతో మాట్లాడారు. ఏఐసిసిలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బిజెపి, వామపక్షాలపై దుమ్మెత్తిపోశారు. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల ప్రజలు మార్పును కోరుకున్నారు. అస్సాం ప్రజలు స్థిరమైన ప్రభుత్వం, అభివృద్ధిని కోరుకున్నారని తెలిపారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు తృణమూల్ కాంగ్రెస్‌కు అనుకూలంగా తమ తీర్పు ఇచ్చారని ప్రణబ్ చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల్లో ప్రజల ఓట్ల ద్వారా మాత్రమే అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. బిజెపి ఈ అవకాశం కోసం వేచి చూడాలి. అయితే యుపిఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని, వ్యవస్థను అస్థిర పరచి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీలో దాదాపు 824 సీట్లు ఉన్నాయి. బిజెపి ఈ సీట్లన్నింటిలో తమ అభ్యర్థులను నిలబెట్టకపోయినా ఎక్కువ సీట్లలో పోటీ చేసింది. వారికి మిగిలింది ఏమిటని ప్రణబ్ నిలదీశారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బిజెపికి ఒక్క సీటు కూడా రాలేదు. బెంగాల్‌లో ఒక్క సీటు వస్తే అస్సాంలో ఐదు సీట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం మీద వారి సీట్ల సంఖ్య రెండంకెల్లో మాత్రమే ఉందని ఎద్దేవా చేశారు. బిజెపి 2008లోనే అధికారంలోకి వచ్చేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుని మమతా బెనర్జీకి అనుకూలంగా ఓటు వేశారు. ఇది మమతా బెనర్జీ విజయమని ఆయన అంగీకరించారు. ఇక వామపక్షాల బలం మూడంకెల నుండి రెండు అంకెలకు తగ్గిపోయిందన్నారు. అస్సాంలో కాంగ్రెస్ బలం 53 నుండి 78 పెరగటం పట్ల ప్రణబ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజలు మార్పును కోరుకున్నారని ప్రణబ్ అభిప్రాయపడ్డారు. తమిళనాడు ప్రజలు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ శిరసావహిస్తుందని చెబుతూ తమ తప్పులను సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన డిఎంకెతో సంబంధాలు యథాతధంగా కొనసాగుతాయా? అన్న ప్రశ్నపై ప్రణబ్ మాట్లాడుతూ ఫలితాలు ప్రతికూలంగా వచ్చినంత మాత్రాన తమ స్నేహంలో ఎలాంటి మార్పు రాదన్నారు. ఎన్నికల్లో గెలుపు, ఓటమి అత్యంత సహజమన్నారు. కాంగ్రెస్‌కు ఏ పార్టీ శతృవుకాదు, అందరితో స్నేహం చేస్తామని తెలిపారు. అలాగని ఓడిపోయినంత మాత్రాన ఒకప్పుడు లోక్‌సభలో కేవలం రెండు సీట్లు మాత్రమే కలిగి ఉన్న బిజెపి ఆ తరువాత కేంద్రంలో అధికారంలోకి రాలేదా? అని ఆయన ప్రశ్నించారు.

మెజార్టీలో రికార్డు



కడప, మే 13:కడప ఉప ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన జగన్మోహన్‌రెడ్డి భారీ మెజారిటీ సాధించి రికార్డు నెలకొల్పారు. అదే విధంగా పులివెందుల శాసనసభకు పోటీచేసి గెలిచిన దివంగత నేత వైఎస్ సతీమణి విజయలక్ష్మి సైతం భారీ మెజారిటీ సాధించి రికార్డు నెలకొల్పారు. ఉప ఎన్నికల్లో 5,45,671 ఓట్ల మెజారిటీ సాధించిన జగన్మోహన్‌రెడ్డి దేశంలో మూడవ స్థానంలో, రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారు. రామ్‌విలాస్ పాశ్వాన్ 7 లక్షల రికార్డు మెజార్టీతో మొదటి స్థానంలో నిలవగా, పశ్చిమబెంగాల్‌కు చెందిన అనిల్ బసు 5.92 లక్షల మెజారిటీతో రెండవ స్థానంలో నిలిచారు. జగన్ తాజాగా 5.45 లక్షల ఓట్ల మెజారిటీతో మూడవ స్థానంలో నిలిచారు. జగన్ తన తండ్రి రికార్డును సైతం బద్దలు కొట్టారు. రాజీవ్ మృతితో 1991లో జరిగిన ఎన్నికల్లో రాజశేఖర్‌రెడ్డి కడప లోక్‌సభకు పోటీచేసి 4.18 లక్షల మెజారిటీ సాధించారు. అప్పట్లో ఇది రికార్డు. అదే విధంగా కడప లోక్‌సభకు ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఇదే అత్యధిక రికార్డు. రాష్ట్రంలో ఈ మెజార్టీ రికార్డు కావడం మరో విశేషం. ఇక పులివెందుల నుంచి అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించిన విజయమ్మ తన భర్త దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్‌రెడ్డి రికార్డును బద్దలుకొట్టారు. 2009లో రాజశేఖర్‌రెడ్డికి 68,681 ఓట్ల మెజారిటీ రాగా, తాజా ఉప ఎన్నికల్లో విజయమ్మకు 85,191 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈ నియోజక వర్గంలో గతంలో ఎవరు ఇంత మెజార్టీ సాధించిన దాఖలాలు లేవు.
విజయోత్సవాలు
కడప ఉప ఎన్నికల్లో జగన్, ఆయన తల్లి విజయం సాధించడంతో జిల్లాలో సంబరాలు అంబరాన్నంటాయి. కడప లోక్‌సభకు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, పులివెందుల శాసనసభకు వైఎస్ విజయమ్మ గెలిచినట్లు ప్రకటించగానే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. రంగులు చల్లుకుని నృత్యాలు చేశారు. జగన్‌కు జై. జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు పార్టీ జెండాలు చేతబట్టుకుని మోటార్‌బైక్‌లపై ర్యాలీలు నిర్వహించారు. మిఠాయిలు పంచుకున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై మొదటి మూడు రౌండ్లు ఓట్ల లెక్కింపులోనే జగన్, విజయమ్మ లీడింగ్‌లో ఉన్నట్లు వార్తలు వెలువడగానే జిల్లా వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. రౌండ్ రౌండ్‌కు మెజారిటీ పెరుగుతూ రావడంతో సంబరాలు అంబరాన్నంటాయి. చివరకు జగన్మోహన్‌రెడ్డి, విజయమ్మ భారీ మెజారిటీతో గెలుపొందినట్లు ప్రకటించగానే ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి పెద్దమొత్తంలో బాణసంచా పేల్చారు. రంగులు చల్లుకుని నృత్యాలు చేశారు. జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాయచోటి, కమలాపురం, మైదుకూరు, బద్వేలు, పోరుమామిళ్ల, రాజంపేట, రైల్వేకోడూరు, లక్కిరెడ్డిపల్లె తదితర ప్రాంతాల్లో భారీ ఎత్తున బాణసంచా కాల్చి అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. జెఎంజె కౌంటింగ్ కేంద్రం బయట రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన వైయస్ జగన్ అభిమానులు, కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున మద్రాసు రహదారిపై నృత్యాలు చేశారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉప ఎన్నికల్లో విజయం సాధించడంతో జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది.
కడప గడపలో వరుసగా వైఎస్ కుటుంబానిదే విజయం
కడప, మే 13: కడప లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన వైఎస్ కుటుంబం మరోసారి విజయం సాధించింది. 1989 నుంచి జరిగిన ఎన్నికల తీరును పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. 89 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున స్వర్గీయ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ ఎం.వి. రమణారెడ్డిపై లక్షా 66 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1991 ఎన్నికల్లో పోటీచేసిన రాజశేఖర్‌రెడ్డి టిడిపి అభ్యర్థి సి.రామచంద్రయ్యపై 4.18 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1996 ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగిన వైఎస్ టిడిపి తరపున పోటీచేసిన కందుల రాజమోహన్‌రెడ్డిని ఢీ కొన్నారు. ఇద్దరి మధ్య హోరా హోరీగా పోటీ జరిగింది. ఈ ఎన్నికల్లో రాజశేఖర్‌రెడ్డి చావు తప్పి కన్నులొట్టపోయిన చందంగా కందుల రాజమోహన్‌రెడ్డిపై 5,445 ఓట్ల మెజారిటీ సాధించారు. 1999లో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన వైఎస్ వివేకానందరెడ్డి తెలుగుదేశం పార్టీ నేత కందుల రాజమోహన్‌రెడ్డిపై 26,500 ఓట్ల మెజార్టీ సాధించారు. 2004 ఎన్నికల్లో వివేకానందరెడ్డి మరోసారి పోటీ చేశారు. టిడిపి తరఫున పోటీచేసిన కందుల రాజమోహన్‌రెడ్డిపై లక్షా 40 వేల మెజార్టీ సాధించారు. 2009లో జగన్మోహన్‌రెడ్డి టిడిపి అభ్యర్థి పాలెం శ్రీకాంత్‌రెడ్డిపై లక్షా 75 వేల ఓట్ల మెజార్టీ సాధించారు. తాజా ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తరఫున పోటీచేసిన వైఎస్ తనయుడు జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి డీఎల్ రవీంద్రారెడ్డిపై 5 లక్షల పైచిలుకు మెజారిటీ సాధించారు. (చిత్రం) ఎన్నికల అధికారినుంచి ధ్రువీకరణ పత్రం అందుకుంటున్న వైఎస్ 

నాన్న, ప్రజలు ఆశీర్వదించారు:జగన్


వేంపల్లె, మే 13: ఉప ఎన్నికల్లో పోటీచేసిన తనను, తన తల్లి విజయమ్మను నాన్న, కడప ప్రజలు ఆశీర్వదించారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప లోక్‌సభ విజేత జగన్మోహన్‌రెడ్డి అన్నారు. కడప ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించి తమను ఆశీర్వదించారని అన్నారు. కడప ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగియగానే వేంపల్లె మండలంలోని ఇడుపులపాయలో ఉన్న వైఎస్‌ఆర్ ఘాట్‌కు చేరుకున్న జగన్మోహన్‌రెడ్డి తన తండ్రికి నివాళులర్పించారు. జగన్‌ను కలిసేందుకు ఇడుపులపాయకు వేలాది మంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు. నీ వెంటే మేమంటూ ప్రజలు నినాదాలు చేశారు. భవిష్యత్తు మనదేనంటూ కేరింతలు కొట్టారు. వైఎస్‌ఆర్‌కు నివాళులు అర్పించిన అనంతరం ఇడుపులపాయలో ఉన్న గెస్ట్‌హౌస్‌కు జగన్ చేరుకొన్నారు. ఆయన వెంట రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, తదితర శాసన సభ్యులు, నాయకులు ఉన్నారు. (చిత్రం) ఇడుపులపాయలో తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులర్పిస్తున్న జగన్ మోహన్‌రెడ్డి