Wednesday, 4 May 2011

పోలీస్ స్టేషన్ ఆవరణలో యువతి ఆత్మహత్య

మాడుగుల, మే 4: ప్రేమించానని నమ్మించి శారీరక సంబంధం సైతం పెట్టుకుని పెళ్లికి నిరాకరించిన ప్రియుడి మోసాన్ని తట్టుకోలేని ఓ యువతి పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్య చేసుకున్న ఈ యువతి మూడో నెల గర్భవతిగా తెలుస్తోంది. మాడుగుల పోలీస్ స్టేషన్ ఆవరణలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. ఇందుకు సంబంధించిన వివరాల ప్రకారం మాడుగులలోని దొర్లవీధికి చెందిన పిల్లి భీముడునాయుడు (నాని) (24), గవరవీధికి చెందిన దుంగా లక్ష్మీదేవి (22) గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఒకరినొకరు ఇష్టపడిన వీరు వివాహం చేసుకోవాలని కూడా నిర్ణయించుకోవడమే కాకుండా వీరిద్దరూ గతంలో ఫొటోను సైతం తీయించుకున్నారు. లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటానని నమ్మించిన నాని ఆమెతో శారీరక సంబంధం కూడా ఏర్పరచుకున్నాడు. దీంతో లక్ష్మీదేవి మూడుసార్లు గర్భ దాల్చడంతో నాని దగ్గరుండి అబార్షన్ చేయించినట్టు తెలుస్తోంది. వివాహం చేసుకునే వరకు ఇటువంటివి మంచివి కావని నమ్మించిన నాని ఆమెతో శారీరక సంబంధాన్ని మాత్రం కొనసాగిస్తున్నాడు. దీంతో ప్రస్తుతం లక్ష్మీదేవి మరోసారి గర్భం దాల్చడంతో తనను వివాహం చేసుకోవాలని పట్టుబట్టింది. అయితే వివాహం చేసుకునేందుకు తనకు ఇష్టమే అయినప్పటికీ తన తల్లిదండ్రులు అంగీకరించడం లేదని ప్రియుడు నాని తెగేసి చెప్పాడు. అంతేకాకుండా వేరే అమ్మాయితో వివాహం చేసుకునేందుకు సైతం సిద్ధపడినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీదేవి నానిని ఇటీవల నిలదీయడంతో వేరే అమ్మాయిని వివాహం చేసుకుంటే కట్నం వస్తుందని, నిన్ను చేసుకుంటే ఏమోస్తుందని ప్రశ్నించినట్టు తెలిసింది. తనను వివాహం చేసుకుంటానని నమ్మబలికి శారీరక సంబంధాన్ని సైతం ఏర్పరచుకున్న ప్రియుడు ఒకేసారి మాట మార్చడంతో కంగుతిన్న లక్ష్మీదేవి గత నెల 29వ తేదీన మాడుగుల పోలీసులను ఆశ్రయించింది. స్థానిక సబ్ ఇన్‌స్పెక్టర్ సెలవులో ఉండడంతో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎల్.తాతబ్బాయి లక్ష్మీదేవి నుంచి ఫిర్యాదు స్వీకరించడమే కాకుండా వీరిద్దరికీ వివాహం జరిపిస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే హామీనైతే ఇచ్చారే తప్పా గత నెల 29వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఈ ఫిర్యాదుపై పోలీసులు స్పందించకపోవడంతో బాధిత యువతి ప్రతీ రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం కూడా లక్ష్మీదేవి పోలీసు స్టేషన్‌కు వెళ్లి తనను మోసగించిన ప్రియుడి విషయమై ఏం చేశారంటూ ఎ.ఎస్.ఐ.ని ప్రశ్నించినట్టు చెబుతున్నారు. దీంతో నానిని ఎ.ఎస్.ఐ. తాతబ్బాయి పిలిపించి విచారించినట్టు తెలుస్తోంది. అయితే తమ కుమారుడు ఎట్టి పరిస్థితులలోనూ లక్ష్మీదేవిని వివాహం చేసుకునేందుకు అంగీకరించేది లేదని నాని తల్లిదండ్రులు సత్తిబాబు, మంగ తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో నాని కూడా తాను ప్రేమించిన యువతిని పెళ్లాడేది లేదంటూ తేల్చి చెప్పాడు. ఆరు సంవత్సరాలుగా ప్రేమించిన ప్రియుడు తనను గర్భవతిని చేసి మోసం చేయడాన్ని తట్టుకోలేని లక్ష్మీదేవి తనతో తెచ్చుకున్న పురుగులు మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసు స్టేషన్ ఆవరణలో పోలీసుల సమక్షంలోనే లక్ష్మీదేవి పురుగుల మందు సేవించడంతో నిశే్చష్టులైన ఆమె బంధువులు వెంటనే దగ్గరలోనే ఉన్న సెయింట్ ఆన్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తీసుకువెళ్లగానే ఆమె మృతి చెందింది. పోలీస్ స్టేషన్ ఆవరణలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా సంచలం కలిగించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న చోడవరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వై.వి.శేషు హూటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రేమించిన యువతిని మోసం చేసిన ప్రియుడు నానితోపాటు ఆయన తల్లిదండ్రులు సత్తిబాబు, మంగలను అరెస్ట్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ ముగ్గురిపై ఐ.పి.ఎస్. 417, 420 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. యువతి మృతదేహన్ని పంచనామాకు తరలించారు.

No comments:

Post a Comment