Saturday 5 March 2011

ఉన్మాది దాడిలో ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి



విశాఖపట్నం. ఓ ఉన్మాది దాడిలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. హంతకుడు భర్తేనని అనుమానిస్తున్నారు. నగరం నడిబొడ్డున జన సమ్మర్ధం కలిగిన ప్రదేశంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. స్థానిక శివాజీపాలేనికి చెందిన దువ్వి కృష్ణవేణి (21)కి ఇదే ప్రాంతానికి చెందిన కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న సిహెచ్.రవికుమార్‌తో గత ఏడాది ఆగస్ట్ 29న వివాహం జరిగింది. అమ్మాయికి అతనిని వివాహం చేసుకోవడం ముందు ఇష్టం లేకపోయినా, ఆ తరువాత తల వంచక తప్పలేదు. వివాహ సమయంలో రెండు లక్షల రూపాయలు, మోటారు సైకిల్ కట్నంగా ఇచ్చారు. పెళ్ళయిన మూడు నెలలు సవ్యంగానే కాపురం చేశారు. ఆ తరువాత భార్య పేర ఉన్న ఇల్లు తన పేరన రాయమని వేధించడం మొదలుపెట్టాడు. కృష్ణవేణి తండ్రి, తల్లి కొన్ని కారణాల వలన విడివిడిగా ఉంటున్నారు. భర్త వేధింపులు తట్టుకోలేక కృష్ణవేణి పుట్టింట్లోనే తల్లి, చెల్లితో కలిసి ఉంటోంది. ఇప్పుడు ఆమె ఐదవ నెల గర్భవతి కూడా. రెండో సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్న కృష్ణవేణి ఉదయం కాలేజీకి వెళ్లి, సాయంత్రం తిరిగి వస్తుంటుంది. కొంత కాలం కిందట భర్త రవికుమార్, కృష్ణవేణిని చంపేస్తానని బెదిరించినట్టు ఆమె బంధువులు చెప్పారు. శుక్రవారం సాయంత్రం కాలేజీ నుంచి బస్సులో మద్దిలపాలెం వరకూ వచ్చిన కృష్ణవేణి కాలి నడకన ఇంటికి బయల్దేరింది. స్థానిక కళాభారతి ఆడిటోరియం వద్దకు రాగానే, కృష్ణవేణిపై అగంతకుడు దాడి చేసి కత్తితో ఆమె గొంతు కోశాడు. ఈ దాడికి పాల్పడింది కృష్ణవేణి భర్తేనని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. హంతకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా తప్పించుకుపారిపోయాడని స్థానికులు చెపుతున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న కృష్ణవేణిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆమె చనిపోయింది. మృతదేహాన్ని కెజిహెచ్‌కు తరలించారు.

No comments:

Post a Comment