Sunday 20 March 2011

పెట్టుబడి వంద కోట్లు...లాభం రెండు వేల కోట్లు


పరవాడ, మార్చి 19: వంద కోట్ల రూపాయలను పెట్టబడి పెట్టి రెండు వేల కోట్ల రూపాయలను రాంకీ ఇండియా లిమిటెడ్ వెనుకేసుకుందని మాజీ మంత్రి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. శనివారం వెనె్నలపాలెంలో గల బండారు స్వగృహంలో స్థానిక విలేఖరులతో మాట్లాడారు. పరవాడ మండలంలో స్థాపించిన జవహర్‌లాల్‌నెహ్రూ ఫార్మాసిటి అభివృద్ధి కార్యక్రమాన్ని రాంకీ యాజమాన్యానికి ప్రభుత్వ అప్పగించింది. ఈ పనులను దక్కించుకున్న రాంకీ యాజమాన్యం నిబంధనలను విస్మరించిందన్నారు. దీంతో వేల కోట్ల రూపాయలను వెనకేసుకుందని ఆయన ఆరోపించారు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా సహకరించిందని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన విలేఖరులకు వివరించారు. 2004 సంవత్సరానికి ముందు తెలుగుదేశం ప్రభుత్వంతో ఎల్ అండ్ టి సమక్షంలో రాంకీ యాజమాన్యం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ప్రపంచస్థాయి నాణ్యత గల అధునాతన పరికరాలను ఫార్మాసిటిలో ఏర్పాటు చేయాలని, అభివృద్ధి చేసిన స్థలాన్ని ఎకరాకు 20లక్షల రూపాయల మేర విక్రయించే విధంగా ఒప్పందం చేసుకున్న రాంకీ యాజమాన్యం ప్రస్తుతం ఫార్మాసిటిలో ఎకరా స్థలం కోటి రూపాయలకు పై బడి విక్రయిస్తున్నారని ఆయన అన్నారు. అయితే ఫార్మాసిటిలో వచ్చిన లాభాల్లో 41శాతం ప్రభుత్వానికి, 59శాతం రాంకీ యాజమాన్యానికి దక్కే విధంగా ఒప్పందం కుదుర్చుకుందన్నారు. అయితే 2004 సంవత్సరం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాంకీ యాజమాన్యానికి వరంగా మారిందన్నారు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ప్రభుత్వం వాటాకింద రావాల్సి 41శాతం నిధుల్లో 12 శాతం ప్రభత్వం రాంకీయాజమాన్యానికి మినహాయింపు ఇచ్చిందన్నారు. అలాగే ఆర్ధిక బిడ్ ప్రభుత్వం, రాంకీ సంస్థ అవకతవకలు చేశాయన్నారు. దీని కారణంగా వేలాది కోట్ల రూపాయల ప్రజా ధనం రాంకీ ఖాతాలోకి వెళ్లిందన్నారు. అలాగే ఫార్మాసిటీకి కేటాయించిన స్థలంలో 250 మీటర్ల పరిధిలో గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న రాంకీ యాజమాన్యం ప్రస్తుతం అది కాస్తా రైతుల భూములపైకి నెట్టిందని ఆయన అన్నారు. ఫార్మాసిటీలోనెలకొల్పిన వ్యర్ధజలాల శుద్ధి కర్మాగారం నిర్మాణం పూర్తి స్థాయిలో ప్రపంచ స్థాయి నాణ్యత పరంగా చేపట్టాలని, అయితే నిబంధనలకు తిలోదకాలు ఇచ్చిన రాంకీ వారికి ఇష్టం వచ్చినట్లుగా నిర్మాణం చేపట్టడంతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు అనుమతులు మంజూరుకు ఆలోచన చేస్తున్నారని ఆయన అన్నారు. గ్రీన్‌బెల్ట్ విషయంలో డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇచ్చి నిబంధనలు పాటించక పోవడంతో ఇటీవల ఆ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి రాంకీ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారని ఆయన అన్నారు. అయినప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎటు వంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఫార్మాసిటిలో మాజీ ముఖ్యమంత్రి వై ఎస్సార్ అల్లుడుతో పాటు రాష్ట్ర మంత్రులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఇక్కడ పరిశ్రమలను స్థాపించారని ఆయన ఆరోపించారు. దీంతో రాంకీ యాజమాన్యం వారి అండ చూసుకొని ఫార్మాసిటిలో పూర్తిగా నిబంధనలను తుంగలోకి తొక్కిందని ఆయన ఆరోపించారు. కాలుష్యరహిత ఫార్మాసిటిగా అప్పటి తెలుగు దేశం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూసిందన్నారు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాంకీ యాజమాన్యానికి పూర్తి అధికారులను కట్టబెట్టి వారి ఇష్టానుసారంగా వ్యవరించేందుకు సహకరించిందని ఆయన విమర్శించారు. దీనిపై ప్రస్తుత ప్రభుత్వం వెంటనే కలుగుజేసి కొని తక్షణమే చర్యలు తీసు కోవాలని లేకుంటే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. విలేఖరుల సమావేశంలో మండలాధ్యక్షులు మాధంశెట్టి నీలబాబు, కార్మికనేత మాసవరపు అప్పలనాయుడు, మత్స్యకార నేత చింతకాయల ముత్యాలు, టిడిపి నేతలు బొండా సన్నిదేముడు, కోమటి వెంకట రమణ, ఇందల కొండలరావు, సింగపల్లి దివాకర్, రొంగలి గోపాలకృష్ట, వర్రి పరిదేశినాయుడు తదితరలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment